శ్రీ నారాయణీయము - ప్రథమ దశకము

శ్రీ నారాయణీయము


ప్రథమ దశకము

భగవత్తత్త్వము

సాంద్రానందావబోధాత్మక మనుపమితం దేశకాలావధిభ్యాం
నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానమ్,
అస్పష్టం దృష్టమాత్రే పున రురుపురుషార్థాత్మకం బ్రహ్మతత్త్వం
తత్తావద్భాతి సాక్షా ద్గురుపవనపురే హంత భాగ్యం జనానామ్. - 1

భావము
గురువాయూరు పురములో దట్టమైన అనందమును మేలుకొలుపు టలో ఘనమైనది,(సచ్చిదానంద ఘనుడు) దేనితో పోల్పబడనిది, దేశకాలములకు అతీతమైనది, బంధవిముక్తమైనది, నిత్యముక్తమైనది. వందలు వేలుయైన ఉపనిషత్తులచే ప్రకాశించునది, భౌతిక దృష్టికి అందని అందమైనది, గొప్పదయిన మోక్ష పురుషార్థమైనది అయిన బ్రహ్మతత్త్వము, సత్యం, జ్ఞానం మొదలైన లక్షణాలు కలిగి, తత్త్వమసి మొదలైన మహావాక్యాలు దేనిని గురించి తెలియజేస్తున్నాయో అది, జనులయొక్క పుణ్యరూపమై శ్రీ కృష్ణమూర్తిగా ఎదుట ప్రకాశించుచున్నది . ఎంతో సంతోషము.

ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలభ్యే యదన్య
త్తన్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటైవమ్,
ఏతే తావద్వయం తు స్థిరతర మనసా విశ్వపీడాపహత్యే
నిశ్శేషాత్మాన మేనం గురుపవనపురాధీశమే వాశ్రయామః. - 2

భావము
ఈ విధముగా దుర్లభమైన వస్తువు కూడా (బ్రహ్మ తత్వమైన కృష్ణుడు కూడా) సులభముగా కరతలామలకంగా లభిస్తున్నా జనులు ఇతర దేవతలను పూజిస్తున్నారు. అయ్యో! ఇది నీచమైనది. కాని మేము “ప్రపంచపీడలను నివారించుటకు” స్థిరమైన మనస్సుతో, త్రికరణ శుద్దిగా సర్వవ్యాపకుదైన ఈ ప్రకాశించు ఈ గురువాయూరు పురాధీశుని (కృష్ణుని) మాత్రమే ఆశ్రయించు చున్నాం.

నత్త్వం యత్తత్ పరాభ్యా మపరికలనతో నిర్మలం తేన తావత్
భూతై ర్భూతేంద్రియై స్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యమ్,
తత్ స్వచ్ఛత్వా ద్యదచ్చాదిత పరసుఖ చిదర్భ నిర్భానరూపం
తస్మిన్ ధన్యా రమంతే శ్రుతిమతిమధురే సుగ్రహే విగ్రహే తే. - 3

భావము
రజస్తమో గుణాలతో కలియక స్వచ్చముగా పంచ భూతములతో, పది ఇంద్రియములతో నీశరీరము ఏర్పడినదను వ్యాస వాక్యము ప్రసిద్ధము. స్వచ్చత్వము వలన అడ్డంకులు లేని పరసుఖానికి ఆధారమైన నీ స్వరూపమును, వివరణ వినడానికి మధురమైన సులభతరమైన నీ విగ్రహమును దర్శించి ధన్యులైన (భాగ్యవంతులైన ) భక్తులు ఆనందాన్ని పొందుచున్నారు.

నిష్కంపే నిత్యపూర్ణే నిరవధిపరమానంద పీయూషరూపే
నిర్లీనానేక ముక్తావలి సుభగతమే నిర్మలబ్రహ్మసింధౌ,
కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్త్వ మాహు స్తదాత్మా
కస్మాన్నో నిష్కల స్త్వం సకల ఇతి వచ స్త్వత్కలాస్వేవ భూమన్. - 4

భావము
నిష్కల రూపములో సముద్రము వలె చలింపనివాడా ! సముద్రము వలె నిత్యపూర్ణుడైనవాడా!( పూర్ణమదః...)

పరిమితిలేని పరమానందమను అమృతముతో నిండిన సముద్ర స్వరూపుడా! అనేకమయిన లీనమయిన ముత్యాల వరుస కలిగినవాడా! (బ్రహ్మజ్ఞానముతో కలిసి ముక్తులయిన వారితో కలిసి మిక్కిలి మనోహరమయినవాడా !)సర్వమంగళ స్వరూపమయిన స్వచ్చమయిన సత్వగుణమను సముద్రంవంటివాడా!

స్వచ్చతరమయిన సత్వ రూపముతో కల్లోలమయిన అలలతో తుల్య మయినవాడా! (అల - సకలరూపమని భావం) ఇలా పెద్దలు చెప్పుచుందురు. శుద్ధ సత్వ స్వరూపుడవయిన నువ్వు నిష్కలుడవిగా ప్రకాశిస్తావు. ఓ గొప్పవాడా! అధికుడా! సకలము యొక్క నామాలు (సకలదేవతల యొక్క నామాలు) నీలోని భాగాలు (నీలోని భాగాలే)

నిర్వ్యాపారో ఒపి నిష్కారణమజ! భజసే యత్మియామీక్షణాఖ్యాం
తేనైవోదేతి లీనా ప్రకృతిరసతి కల్పాఒపి కల్పాదికాలే ।
తస్యాస్సంశుద్ధమంశం కమపి తమతిరోధాయకం సత్త్వరూపం
సత్వం ధృత్వా దధాసి స్వమహిమ విభవాకుంఠ! వైకుంఠ! రూపం ॥ - 5

భావము
ఐశ్వర్యము సిద్ధింప చేయువైకుంఠ రూపములో మాయలో వుండు విష్ణు రూపమును ధరించినవాడా!పుట్టనివాడా! నువ్వు ఏ క్రియ(కర్మ) లేని వాడి వైనప్పటికి కారణము లేని మాయా శక్తిని ప్రేరేపించే దర్శన క్రియనుఅంగీకరిస్తావు. (అయస్కాంతము దగ్గర ఉన్న ఇనుముకు చలనము కలిగినట్లుగా స్వామి సన్ని ధానములో ఉన్న ప్రకృతిలో ప్రేరణ జరుగును) అందువలననే కల్పాంతమందు నీ మాయ లీనమగుచున్నది. కల్పాదియందు వ్యక్తమగుచున్నది .ఆమాయయొక్క పరిశుద్ధమయిన అంశం కలిగిన, ఆ చైతన్యప్రకాశమయిన సత్వగుణమును ధరిసావు. ఆమాయా రూపాన్ని ధరించుట నీ స్వమహిమావిలాసం చేతనే కాని మరోకారణం లేదు.

తత్తే ప్రత్యగ్ర ధారాధర లలిత కలాయావలీ కేలికారం
లావణ్య స్యెకసారం సుకృతిజనదృశాం పూర్ణపుణ్యావతారమ్‌ ।
లక్ష్మీనిశ్శంకలీలానిలయనమమృతస్యందసందోహమంతః
సించత్సంచింతకానాం వపురనుకలయే మారుతాగారనాథ! ॥ - 6

భావము
ఓ గురువాయూర్‌ స్వామీ! నీయొక్క కొత్త మేఘ కాంతులను అతిశయించిన,కోరబడిన, ఇరుగుడు పుష్పంలా (కలువపూవులా) శ్యామలమైన, సౌందర్యముయొక్క సారభూతమైన పుణ్యవంతులచే చూడబడేది,పూర్ణ పుణ్యావతారమైన, లక్ష్మీదేవి సందేహము లేని లీలలకు నిలయమయిన, ఉపాసకుల హృదయాలలో అమృతాన్ని నింపేది అయిన నీ దివ్య శరీరమును (రూపమును) తలుస్తుంటాం.

కష్టా తే సృష్టి చేష్టా బహుతరభవఖేదావహా జీవభాజామ్‌
ఇత్యేవం పూర్వమాలోచితమజిత! మయా నైవమద్యాభిజానే ।
నో చేజ్జీవాః కథం వా మధురతరమిదం త్వద్వపుశ్చిద్రసార్థం
నేతైఃశ్రోతైశ్చ పీత్వా పరమరససుధాంభోధిపూరే రమేరన్‌ ॥ - 7

భావము
జయింపబడనివాడా! (మాయకు వశము కానివాడా !) శ్రీ కృష్ణా ! నీ సృష్టి చేష్ట కష్టభరితమైనదని సంసారములకు సంబంధించినదుఃఖములను పుట్టించునదని జీవులను విడగొట్టునదని,అనగా మరణములను కలిగించునదని ఈవిధముగా పూర్వము ఆలోచించే వాడిని. కాని ఇప్పుడు ఆవిధంగా ఆలోచించటం లేదు. నీసృష్టే లేకుంటే ఈ జీవులు ఎట్లు నీ మధురతరమైన జ్ఞానానంద రస స్వరూపమయిన నీశరీరమును కన్నులచే చెవులచే తాగి పరమరసామృత సముద్రంలో తేలియాడగలరు? (కృష్ణ రూప మాధుర్యమును అనుభవించుటయే జీవన పరమార్ధమని భావం)

నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పుర స్తెరనభ్యర్థితాన-
ప్యర్దాన్‌ కామానజస్రం వితరతి పరమానందసాంద్రాం గతిం చ ।
ఇత్తం నిశ్శేషలభ్యో నిరవధికఫలః పారిజాతో హరే! త్వం
క్షుద్రం తం శక్రవాటీద్రుమమభిలషతి వ్యర్థమర్థి వ్రజోజ యమ్‌ ॥ - 8

భావము
ఓ శ్రీ హరీ! నిన్ను శరణు కోరిన వినయశీలుల ఎదుట నువు కల్ప వృక్షంలా లభిస్తావు. ఎల్లప్పుడు అడగనివారికి కూడా అర్థ కామాలను, పరమానంద మోక్ష విశేష మార్గాలను ఎల్లప్పుడు ఇస్తావు. ఈ విధంగా అశేషముగా లభింపచేసూ నిరవధిక ఫలాలను అనుగ్రహిస్తూ కల్పవృక్షమువలె నువ్వుండగా తెలియని పామరులు ఆ ఇంద్రుని నందనోద్యాన కల్పవృక్షాన్నికోరుకుంటారు. ఇంతకన్నా అడిగే వారికి వ్యర్థమైన పని ఇంకొకటి లేదు.

కారుణ్యాత్మామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్యం విశేషాత్‌
ఐశ్వర్యాదీశతే౭_న్యే జగతి పరజనే స్వాత్మనోఒపీశ్వరస్వమ్‌
త్వయ్యుచ్చెరారమంతి ప్రతిపదమధురే చేతనాః స్పీతభాగ్యాః
త్వం చాత్మారామ వఏవేత్యతులగుణగణాధార ! శౌరే! నమస్తే ॥ - 9

భావము
శ్రీకృష్ణుడా! దయతో ఇతర దేవతలు కోరికను తీరుస్తుంటారు కదా! వారిని మించిన దయతో భక్తులకు నువ్వు నీ ఆత్మనే ఇస్తావు. ఇతర దేవతలు తమతమ విశేష ఐశ్వర్యాల వల్ల ఈ ప్రపంచాన్ని పాలిస్తుంటారు. నువ్వు ఆ దేవతలతో సహ అందరిని ఆంతరంగికంగా పాలిస్తుంటావు.నీయందు ఎలుగెత్తి ప్రతి పద మధురమైన నీ పేరును, రూపాన్ని ధ్యానిస్తూ విస్తృతమైనభాగ్యాలతో నువ్వే ఆత్మారాముడవని భక్తులు ఆనందం పొందుతుంటారు. సాటిలేని గుణ సమూహములకు ఆధారమైన వాడా! శ్రీ కృష్ణా! నీకు నమస్కారం.

ఐశ్వర్యం శంకరాదీశ్వరవినియమనం, విశ్వతేజో హరాణాం
తేజస్సంహారి వీర్యం, విమలమపి యశో నిస్ఫృహైశ్చోపగీతం
అంగాసంగా సదా శ్రీరఖిలవిదసి, న క్వాపి తే సంగవారా
వాతాగారవాసిన్‌! మురహర! భగవచ్చబ్దముఖ్యాశ్రయోజ సి ॥ - 10

భావము
గురువాయూర్‌ దేవాలయము నివాసముగా కలిగినవాడా! మురాసురుని చంపినవాడా! నీ ఐశ్వర్యము ఈశ్వరులైన శంకరుడు మొదలైన వారిని నియమించునది. నీ పరాక్రమము అశేష తేజోమూర్తులయిన శంకరాదుల తేజస్సును హరించ గల సామర్థ్యము కలిగినది. అంతట వ్యాపించు నీ కీర్తి స్వచ్చమై, పాప నాశకమై ముక్తులచే గానము చేయబడునది. ఎప్పుడు లక్ష్మి నీ వక్ష స్థలమును ఆశ్రయించి ఉన్నది. కాని నీకు సంగము అను మాట ఎప్పుడు లేదు. నువ్వు అఖిల వేత్తవు.భగవంతుడు అనుశబ్దమునకు నువ్వు ముఖ్యమైన ఆశ్రయము కలవాడివి. (ఇతర దేవతల విషయములో అది వాడుక అని కవి భావం)

1వ దశకము సమాప్తము.